Telangana: తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్... పొందాలంటే అర్హతలివి!

10 Percent EWS Reservation in Telangana
  • 10 శాతం రిజర్వేషన్ పై జీవో విడుదల
  • వార్షికాదాయం రూ. 8 లక్షల లోపుంటేనే వర్తింపు
  • ప్రస్తుతం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉండరాదు
  • నిబంధనలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ జీవో నంబర్ 33 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 21న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సమీక్షించిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ రిజర్వేషన్ మైనారిటీ విద్యా సంస్థలు మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో వర్తించనున్నాయి. అన్ని రకాల ఉద్యోగావకాశాల్లో 10 శాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వ్ అవుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం జనాభా అగ్రవర్ణ కేటగిరీలో ఉండగా, వీరిలో 90 శాతం వరకూ రిజర్వేషన్లకు అర్హులుగా ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గంగా ఎవరిని గుర్తిస్తారన్న విషయాన్ని పరిశీలిస్తే...

ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించని వారు ఈడబ్ల్యూఎస్ వర్గంగా గుర్తించబడతారు. ఇక రిజర్వేషన్ ను పొందాలంటే, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదు. ఐదెకరాలకు పైగా భూమి ఉండరాదు. 1000 చదరపు అడుగులకు పైన నివాస ప్లాట్ ఉండరాదు. నోటిఫైడ్ మునిసిపాలిటీల్లో 100 గజాల కన్నా ఎక్కువగా, ఇతర ప్రాంతాల్లో 200 గజాల కన్నా ఎక్కువగా విస్తీర్ణం ఉండే ఓపెన్ ప్లాట్ ఉండకూడదు.

కుటుంబ వార్షికాదాయం లెక్కించే సమయంలో రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు వయసులో ఉండే తోబుట్టువుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఇక ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దారు, ఆపై అధికారి మాత్రమే జారీ చేయాల్సి వుంటుంది. ఏదైనా వివరాలు తప్పుగా ఇచ్చారని భవిష్యత్తులో తేలితే పొందిన సీటును లేదా ఉద్యోగాన్ని రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Telangana
EWS
Reservations

More Telugu News