KTR: వృద్ధురాలి అభిమానానికి కేటీఆర్ ఫిదా!

KTR pleases after an old woman admiration
  • గంభీరావుపేటలో కేటీఆర్ పర్యటన
  • పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
  • కేటీఆర్ ను కలిసేందుకు వచ్చిన వృద్ధురాలు
  • కేటీఆర్ కోసం చాలాదూరం నుంచి వచ్చానని వెల్లడి
  • సెల్ఫీతో సంతోషపరిచిన కేటీఆర్
తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వృద్ధురాలి అభిమానానికి ముగ్ధులయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారుల ఇళ్లకు తానే వెళ్లి స్వయంగా అందించారు. మహిళలకు కుట్టు యంత్రాలు, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పత్రాలు పంపిణీ చేశారు. ఇవేకాకుండా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

అనంతరం తన వాహనం వద్దకు వస్తుండగా ఓ వృద్ధురాలు నేరుగా కేటీఆర్ వద్దకు వచ్చింది. దాంతో ఆమెను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఏం కావాలని అడిగారు. మీతో ఓ సెల్ఫీ కోసం చాలా దూరం నుంచి వచ్చానని ఆ వృద్ధురాలు తెలిపింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మాస్కు తీసేసి తనతో ఓ సెల్ఫీ దిగాలని ఆమె కోరింది. దాంతో ఆమె కోరినట్టుగానే కేటీఆర్ ఓ సెల్ఫీ దిగి సంతోషానికి గురిచేశారు. అంతేకాదు, ఇంకేమైనా కావాలా అని ఆ వృద్ధురాలిని అడిగారు. దాంతో ఆమె.... తెలంగాణ వచ్చింది, అది చాలు అని భావోద్వేగంతో బదులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
KTR
Old Woman
Selfie
Gambhirao Pet
Telangana

More Telugu News