Jagan: విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

CM Jagan writes to PM Modi over Vizag Steel Plant
  • విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ఏపీలో తీవ్ర వ్యతిరేకత
  • మండిపడుతున్న రాజకీయ పక్షాలు
  • కేంద్రం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న సీఎం జగన్
  • ఇతర మార్గాలు అన్వేషించాలని విజ్ఞప్తి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ వినిపిస్తున్నాయి. అందుకు కారణం కేంద్రం తీసుకున్న నిర్ణయమే. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాంటి సంస్థల్లో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ఉంది.

కేంద్రం నిర్ణయంపై ఏపీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై మరోసారి సమీక్షించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంటు కారణంగా 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని, వేలాది మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని వివరించారు. ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, ఈ భూముల విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

అయితే, ఉత్పత్తి వ్యయం భారం కావడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుందని వెల్లడించారు.  ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని ప్రధానికి వివరించారు. గతేడాది డిసెంబరులో రూ.200 కోట్ల మేర లాభం కూడా వచ్చిందని, వచ్చే రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే ప్లాంటు కోలుకుంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్లాంటును బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా గనులు లేవని, అధిక భారం మోస్తూ ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. సొంతంగా గనులు కేటాయిస్తే ఇతర ఉక్కు పరిశ్రమలతో పోటీ పడే స్థాయికి చేరుతుందని సీఎం జగన్ వివరించారు.
Jagan
Vizag Steel Plant
Narendra Modi
Andhra Pradesh

More Telugu News