Ayyanna Patrudu: మరో ఓబులాపురం చూడబోతున్నాం, మరో గాలి జనార్దన్ రెడ్డిని చూడబోతున్నాం: అయ్యన్నపాత్రుడు

Ayyanna patrudu reacts to Visakha Steel Plant privatisation
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
  • జగన్ భయంకరమైన స్కెచ్ వేశాడన్న అయ్యన్న
  • బినామీలతో ప్లాంట్ ను కొనుగోలు చేయిస్తాడని వ్యాఖ్యలు
  • ఐదు కోట్ల ఆంధ్రులు అడ్డుకుంటారన్న అయ్యన్న  
విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అంశంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్ల ఆస్తుల కోసమే జగన్ రెడ్డి ఈ స్కెచ్ వేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారని, కానీ జగన్ రెడ్డి అసలు టార్గెట్ బాక్సైట్ అని అయ్యన్న ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్లు అనేదాన్ని 2009లోనే సాధించాడని, అయితే కొన్ని లక్షల కోట్ల విలువైన బాక్సైట్ మీద వేసిన స్కెచ్ లో భాగమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అని వివరించారు.

"స్టీల్ ప్లాంట్ ను తన బినామీలతో కొనుగోలు చేయించి, బాక్సైట్ వెలికితీతను ఆ కంపెనీకి అప్పజెప్పే భయంకరమైన స్కెచ్ ఇది. తద్వారా లక్షల కోట్లు వెనకేసేందుకు చేస్తున్న అతి భారీ కుట్ర" అని ఆరోపించారు. ఇప్పుడు మరో ఓబులాపురం చూడబోతున్నామని, మరో గాలి జనార్దన్ రెడ్డిని చూడబోతున్నామని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఈ కుట్రను ఉత్తరాంధ్రతో పాటు 5 కోట్ల ఆంధ్రులు అడ్డుకుంటారని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అంటూ అయ్యన్న నినదించారు.
Ayyanna Patrudu
Visakha Steel Plant
Privatisation
Jagan
Bauxite

More Telugu News