Maharashtra: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కోవిడ్.. కరోనాను ఓడించి వస్తానని ట్వీట్

Maharashtra Home Minister Anil Deshmukh Tests Positive For COVID
  • తూర్పు విదర్భ పర్యటన అనంతరం గురువారం నాగ్‌పూర్ రాక
  • కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడి
  • తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలన్న మంత్రి
మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. తనకు వైరస్ సంక్రమించిందని, అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైరస్‌ను ఓడించిన అనంతరం తిరిగి మీ సేవలకు అంకితమవుతానని పేర్కొన్నారు.

తూర్పు విదర్భ పర్యటనలో ఉన్న మంత్రి దేశ్‌ముఖ్ గురువారమే నాగ్‌పూర్ వచ్చినట్టు రాష్ట్ర వైద్యాధికారి ఒకరు తెలిపారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. మంత్రి ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ఆయన నివాసంలో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండమని సలహా ఇచ్చారా? లేక, ఆసుపత్రిలో చేరనున్నారా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
Maharashtra
Anil Deshmukh
COVID19

More Telugu News