విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రధానిని కలుస్తాం: పవన్ కల్యాణ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి ఉక్కు కర్మాగారం
- కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న పవన్
- ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని వెల్లడి
- మన్మోహన్ హయాంలోనే దీనికి బీజం పడిందని వ్యాఖ్యలు
22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17 వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. నాడు ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని, 32 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటించారు.