UGC-NET: మే 2 నుంచి యూజీసీ-నెట్ పరీక్షలు

  • ఇవాళ్టి నుంచి మార్చి 2 వరకు దరఖాస్తులు
  • మార్చి 3 వరకు ఫీజు చెల్లించే అవకాశం
  • ఆన్ లైన్ లో పరీక్ష
  • అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Centre announces UGC NET dates

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్ తేదీలను కేంద్రం వెల్లడించింది. మే 2 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ తెలిపారు. మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12,, 14, 17 తేదీల్లో యూజీసీ నెట్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఈ మేరకు పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ పరీక్ష రాయబోతున్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షల కోసం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు దరఖాస్తు గడువుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ugcnet.nta.nic.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, దరఖాస్తు రుసుము మార్చి 3వరకు చెల్లించవచ్చు. యూజీసీ-నెట్ లో సాధించే మార్కులు జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడే క్రమంలో ఉపయోగపడతాయి.

More Telugu News