Tech Mahindra: ఆటోమేషన్ ఫలితం.. 5 వేల మంది ఉద్యోగులపై టెక్ మహీంద్రా వేటు!

Tech Mahindra decided to pink slip over 5 thousand employees
  • నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంతో వేటు
  • గత త్రైమాసికంలో 2500 మంది తొలగింపు
  • మొత్తం సిబ్బంది సంఖ్యను 38 వేలకు పరిమితం చేసే యోచన
ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ అమలులో నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంతో దాదాపు 5 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతకుముందటి త్రైమాసికంతో పోలిస్తే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగినప్పటికీ 2,500 మందిని తొలగించింది. ఇప్పుడు అంతకు రెండింతల మందిని తొలగించి, మొత్తం సిబ్బంది సంఖ్యను 38 వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) విభాగంలో పనిచేస్తున్న వారిపైనే ఈ వేటు ఉండనుంది.

కంపెనీ ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని టెక్ మహీంద్ర నిర్ణయించడం గమనార్హం. ఉత్పాదకతతోపాటు ఆదాయం పెరగడం కూడా ఈ నిర్ణయం వెనకున్న మరో కారణమని ఆ సంస్థ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం వల్ల కొన్ని అద్దె భవనాలను కూడా ఖాళీ చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఖాతాదారుల అవసరాల మేరకు 40 శాతం మంది ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
Tech Mahindra
BPS
Employees
Automation
AI

More Telugu News