Arjun Sarja: రవితేజ సినిమాలో కీలక పాత్రలో యాక్షన్ కింగ్!

Arjun to play key role in Ravitejas film
  • అప్పుడప్పుడు కీలక పాత్రలలో అర్జున్ 
  • ఆమధ్య 'నా పేరు సూర్య'లో ముఖ్య పాత్ర
  • 'ఖిలాడి' షూటింగులో యాక్షన్ కింగ్    
సీనియర్ నటుడు అర్జున్ గురించి ఈవేళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో తెలుగులో కథానాయకుడుగా పలు సినిమాలలో నటించి.. యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నారు. అందుకే, ఆయనకంటూ ఇప్పటికీ తెలుగునాట అభిమాన ప్రేక్షకులు వున్నారు. ఇప్పటికీ అటు హీరోగా నటిస్తూనే.. మరోపక్క ప్రాధాన్యత వున్న కీలక పాత్రలలో కూడా అప్పుడప్పుడు ఆయన కనిపిస్తున్నారు. ఆమధ్య తెలుగులో అలాగే 'నా పేరు సూర్య' సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు.

ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రంలోనే అర్జున్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

'2021 నూతన సంవత్సరంలో ఇదొక కొత్త ప్రారంభం.. ఖిలాడి సెట్లో నేను..' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెడుతూ.. అక్కడ దిగిన తన తాజా ఫొటోను కూడ అర్జున్ పోస్ట్ చేశారు. ఇక ఈ ఖిలాడి సినిమాలో రవితేజ రెండు విభిన్న తరహా పాత్రలను పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలావుంచితే, సంక్రాంతికి వచ్చిన రవితేజ 'క్రాక్' సినిమా సూపర్ హిట్టయింది.  
Arjun Sarja
Raviteja
Ramesh Varma

More Telugu News