Farmers: ఢిల్లీ సరిహద్దుల్లోకి మళ్లీ భారీగా తరలివస్తున్న రైతులు

Tensions erupted in Singhu border once again
  • సింఘు, టిక్రీ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • సింఘు వద్ద రైతులపై దాడికి దిగిన ‘స్థానికులు’
  • నేడు సద్భావన దినం పాటించనున్న రైతులు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు మళ్లీ పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. ఈసారి ఆరు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో నిరసన ప్రాంతాలకు తరలివస్తున్నారు. దీంతో సింఘు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ నుంచి వెయ్యిమంది రైతులు గాజీపూర్ దీక్షా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. అలాగే, ఢిల్లీ సరిహద్దులకు వెళ్లేందుకు హర్యానా రైతులు కూడా సిద్ధమవుతున్నారు.

సింఘు సరిహద్దు వద్దకు చేరుకున్న స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలంటూ రైతులపై కర్రలతో దాడికి దిగారు. వారు వేసుకున్న టెంట్లను పీకిపారేశారు. రైతులపైకి రాళ్లు రువ్వారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. టిక్రీ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో రెండు చోట్లా బలగాలను భారీగా మోహరించారు. రైతు ఉద్యమానికి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) చీఫ్ అజిత్ సింగ్ మద్దతు ప్రకటించారు.

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నేడు సద్భావన దినం పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు ఉపవాస దీక్షచేపట్టనున్నారు.
Farmers
Singhu Border
Tikri
Farm Laws

More Telugu News