Rajasthan: ప్రియురాలి ఇంటికెళ్లి.. తప్పించుకునే క్రమంలో పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయిన రాజస్థాన్ యువకుడు!

Rajasthan boy mistakenly cross indian border and entered in pak
  • అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో తప్పించుకున్న యువకుడు
  • పారిపోతూ పొరపాటున పాక్ భూభాగంలోకి
  • ప్రస్తుతం సింధ్ పోలీసుల అదుపులో యువకుడు
ప్రియురాలిని కలిసేందుకు రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు అకస్మాత్తుగా ఆమె తల్లిదండ్రులు రావడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోతూ భారత సరిహద్దును దాటి పాకిస్థాన్ భూభాగంలో అడుగుపెట్టాడు. అక్కడ అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ సమాచారాన్ని రాజస్థాన్ పోలీసులకు అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. గెమ్రా రామ్మేఘ్‌వల్ (19) భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని కుంహారా కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతేడాది నవంబరులో ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు రావడంతో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. అలా పారిపోతూ పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టాడు.

గెమ్రాను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు విచారణ అనంతరం రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు గెమ్రాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కేసును పరిశీలిస్తున్న బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పాకిస్థాన్ రేంజర్లతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.  యువకుడు సింధ్ పోలీసుల అధీనంలో ఉన్నాడని, చట్టపరమైన చర్యల అనంతరం అతడిని భారత్‌కు అప్పగిస్తారని తెలిపారు.
Rajasthan
Lover
Pakistan

More Telugu News