Parliament: నేటి నుంచి పార్లమెంట్... అస్త్రశస్త్రాలతో సిద్ధమైన పార్టీలు!

Parliament Budget Session From Today
  • నేడు రాష్ట్రపతి ప్రసంగం, ఆపై ఆర్థిక సర్వే విడుదల
  • రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న 16 విపక్ష పార్టీలు
  • వాడివేడిగా సాగనున్న ఉభయ సభలు
  • ఏప్రిల్ 8తో ముగియనున్న బడ్జెట్ సెషన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉభయసభలు సాగనున్నాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనుండగా, ఆపై ఆర్థిక సర్వే సభ ముందుకు రానుంది. కాగా, రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణమూల్, డీఎంకే, శివసేన సహా 16 పార్టీలు ప్రకటించాయి.

దీంతో సభలో తొలిరోజున అధికార ఎన్డీయే సభ్యులు మాత్రమే కనిపించే అవకాశముంది. ఇక, సాగు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ, రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నేటి సభ అనంతరం 1వ తేదీ సోమవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2021-22 సంవత్సరానికిగాను బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా కాగిత రహిత బడ్జెట్ సభ ముందుకు రానుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రతులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్టు లోక్ సభ కార్యదర్శి ప్రకటించారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా లోక్ సభ, రాజ్యసభలు వేర్వేరు సమయాల్లో ఐదేసి గంటల చొప్పున పనిచేయనున్నాయి. ఉదయం పూట లోక్ సభ, మధ్యాహ్నం తరువాత రాజ్యసభలో కార్యకలాపాలు సాగనున్నాయి. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయగా, ఈ దఫా తిరిగి ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటు మెంబర్ బిల్లులను కూడా తిరిగి పునరుద్ధరించనున్నారు.

ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొన్ని ఆర్డినెన్స్ లను ఈ సమావేశాల్లోనే చట్టాలుగా మార్చాలని అధికార ఎన్డీయే భావిస్తోంది. ఇదే సమయంలో వివిధ రకాల సమస్యలను ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 8తో ముగియనున్నాయి. తొలి విడతలో ఫిబ్రవరి 15 వరకు, ఆపై రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ కొనసాగుతాయి.
Parliament
Budget
Lok Sabha
Rajya Sabha

More Telugu News