Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ!

Local body polls nominations in Andhrapradesh starts today
  • ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ‘పంచాయతీ’ సందడి
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఫిబ్రవరి 4న అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ‘పంచాయతీ’ సందడి మొదలైంది. తొలి దశ ఎన్నికల కోసం నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దశలో 12 జిల్లాల్లో 3,249 పంచాయతీలకు, వాటి పరిధిలోని 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి 3,339 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే, వివిధ కారణాలతో వాటిలో 90 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదు. అలాగే, 33,496 వార్డుల స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇందులో 992 వార్డులు తగ్గాయి. తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.

తొలి దశలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 31న సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 4న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అప్పటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం చేసుకోవచ్చు. 9న ఎన్నికలు జరుగుతాయి.
Andhra Pradesh
Panchayat polls
Nominations

More Telugu News