Sasikala: జైలు నుంచి శశికళ విడుదల.... ఆరోగ్యరీత్యా మరో మూడ్రోజులు ఆసుపత్రిలోనే!

Sasikala released from Bengaluru jail
  • అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ
  • పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల
  • కరోనాకు చికిత్స పొందుతున్న చిన్నమ్మ
  • ఆక్సిజన్ అందిస్తున్నామన్న వైద్యులు
అన్నా డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ (66) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించిన శశికళ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు.

కాగా, శశికళ గత కొన్నిరోజులుగా బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి చిన్నమ్మ డిశ్చార్జికి మరో మూడ్రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.

శశికళను ఇవాళ డిశ్చార్జి చేయలేమని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా, అప్పుడప్పుడు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆమె మరో రెండు మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వివరించారు.

అక్రమాస్తుల కేసులో శశికళకు 2017లో నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు నిర్దేశించిన మేరకు రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది. జరిమానా చెల్లించకపోతే శశికళ అదనంగా మరో ఏడాది జైల్లో ఉండాల్సి వచ్చేది.
Sasikala
Release
Parappana Agrahara Jail
Bengaluru
Corona Virus
Victoria Hospital

More Telugu News