Brazil: బ్రెజిల్ లో విమాన ప్రమాదం... నలుగురు ఫుట్ బాల్ ఆటగాళ్లు సహా క్లబ్ అధ్యక్షుడు దుర్మరణం!

Flight Accident in Brazil
  • మ్యాచ్ ఆడేందుకు బయలుదేరిన ఆటగాళ్లు
  • టేకాఫ్ అవుతుండగానే క్రాష్ ల్యాండింగ్
  • పైలెట్ సహా ఆరుగురి మృతి
బ్రెజిల్ లో జరుగుతున్న ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లను తీసుకుని వెళుతున్న ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో పాల్మాస్ ఫుట్ బాల్ క్లబ్ అధ్యక్షుడు లూకాస్ మైరా సహా నలుగురు ఆటగాళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో లూకాస్ ప్రాక్సీడెస్, గుయ్ హెర్మే నోయ్, రానుల్, మార్కస్ మొలినారీ మరణించారని, విమానానికి పైలట్ గా ఉన్న వాగ్నర్ కూడా కన్నుమూశారని బ్రెజిల్ విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

టుకాన్టినినెన్స్ ఏవియేషన్ అసోసియేషన్ నుంచి టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో సాంకేతిక లోపం ఏర్పడిందని, ఈ విమానం రన్ వే చివర కుప్పకూలిందని ప్రకటించిన పాల్మాస్ క్లబ్, ఆటగాళ్ల మరణం తమకు తీరని లోటని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పేర్కొంది.

ఈ విమానం పాల్మాస్ కు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొయానియాకు బయలుదేరింది. సోమవారం నాడు ఈ టీమ్ కోపా వర్డీ కప్ లో భాగంగా మ్యాచ్ ఆడాల్సి వుంది. ఈ ఘటనతో పోటీలను నిలిపివేశారు. కాగా, ఇది ఏ మోడల్ విమానమన్న విషయాన్ని క్లబ్ వెల్లడించలేదు. బ్రెజిల్ లో జరిగే విమాన ప్రమాదాల్లో ఫుట్ బాల్ ఆటగాళ్లు మరణించడం ఇదే తొలిసారేమీ కాదు.

2016లో జరిగిన ఘోర ప్రమాదంలో చాపెకోయిన్సీ టీమ్ మొత్తం దుర్మరణం పాలైంది. కొలంబియాలో జరుగుతున్న కోపా సూడామెరినికా ఫైనల్స్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లను తీసుకుని వెళుతున్న విమానం, మెడిలిన్ శివార్లలోని ఓ కొండ ప్రాంతంలో కుప్పకూలింది. అంతకు రెండేళ్ల ముందు స్టేట్ ఆఫ్ గోజాస్ సమీపంలో హెలికాప్టర్ కూలగా, బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఫెర్నాండో దుర్మరణం పాలయ్యారు.
Brazil
Football
Flight Accident
Died

More Telugu News