Divyavani: బైబిల్ తో వ్యాపారం చేస్తున్న వారి దురాలోచనలను క్రైస్తవ సంఘాలు గుర్తించాలి: దివ్యవాణి

Divyavani fires on Jagan
  • దేవుని వాక్యానికి విరుద్ధంగా జగన్ చర్యలు ఉన్నాయి
  • చంద్రబాబు వ్యాఖ్యలను క్రైస్తవ సంఘాల్లోని కొందరు వక్రీకరిస్తున్నారు  
  • 140 ఆలయాలపై దాడులు జరిగితే సరైన స్పందనే లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రీస్తు బిడ్డనని చెప్పుకునే జగన్ రెడ్డి చర్యలు క్రైస్తవ మత ప్రతిష్టను పెంచేలా లేవని అన్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని... ఎవరికీ సాష్టాంగపడకూడదని ప్రభువు చెపుతుంటే... జగన్ మాత్రం స్వామీజీల కాళ్లపై పడుతున్నారని విమర్శించారు. బైబిల్ తో వ్యాపారం చేస్తున్న వారి దురాలోచనలను క్రైస్తవ సంఘాలు గుర్తించాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలను క్రైస్తవ సంఘాల్లోని కొందరు వక్రీకరిస్తున్నారని... కులాలు, మతాలు, వర్గాలను చంద్రబాబు సమానంగా చూశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అదే మాదిరి పక్షపాతం లేకుండా ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు.

తాడేపల్లిలో చర్చిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో అక్కడకు వెళ్లారని... న్యాయం జరిగేంత వరకు అక్కడే ఉన్నారని దివ్యవాణి తెలిపారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత 140కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే... ప్రభుత్వం నుంచి సరైన స్పందనే లేదని విమర్శించారు. దీనిపై విపక్షాలు ప్రశ్నిస్తే మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసులను కొట్టేయించుకోవడానికి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న వ్యక్తి ఎవరో ప్రజలు గుర్తించాలని అన్నారు. అమరావతిలో వేల మంది క్రైస్తవులు ఉన్నారని... వారి పట్ల కూడా జగన్ కనికరం చూపలేదని మండిపడ్డారు.
Divyavani
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News