Telangana: ఆటో కార్మిక సహకార పరపతి సంఘం కోసం ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టిన మంత్రి హరీశ్ రావు

Telangana minister harish rao gave 45 lakhs for auto workers coop society
  • రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మిక పరపతి సంఘం
  • మూలధనానికి సరిపడా డబ్బులు లేక మంత్రిని ఆశ్రయించిన కార్మికులు
  • ఇంటి స్థలాన్ని తాకట్టుపెట్టి రూ. 45 లక్షలు ఇచ్చిన మంత్రి
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు.

సంఘాన్ని అయితే ఏర్పాటు చేయించారు కానీ, దానికి ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా తన ఇంటి స్థలాన్నే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు తీసుకుని ఆ సొమ్మును సంఘం ఖాతాలో జమ చేయించి ఆటో కార్మికుల హృదయాలను దోచుకున్నారు. నేడు ఈ సంఘాన్ని ఆయన ప్రారంభించి సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్‌, జత యూనిఫాం అందించనున్నారు.

రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘం కోసం సభ్యులు తమ వాటా ధనంగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున మొత్తం రూ. 8.55 లక్షలు జమచేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది. మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో  డ్రైవర్లు అందరూ కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వినిపించారు.


స్పందించిన హరీశ్ రావు  ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంగధాంపల్లిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు తీసుకుని ఆ మొత్తాన్ని మూలధనంగా జమ చేయించారు. ఫలితంగా రూ. 53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. ఇందులో 666 మంది కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇప్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూలధనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితి తెలిసి తనకు తోచిన సాయం చేశానని, తన సాయంతో ఆటోకార్మికులు నిలదొక్కుకుంటే చాలని అన్నారు.
Telangana
Auto workers
Siddipet District
Harish Rao
Auto workers cooperative society

More Telugu News