Rahul Gandhi: కొత్త చట్టాలతో వ్యవసాయంపై నలుగురైదుగురి గుత్తాధిపత్యం: రాహుల్​ గాంధీ విమర్శలు

Farm Laws mean to destroy the nation says Rahul Gandhi
  • దేశం మొత్తం వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్య
  • సాగు చట్టాలతో రైతులకు మద్దతు ధర రాదని ఆరోపణ
  • క్రోనీ క్యాపిటలిస్టులు లక్షల టన్నుల ధాన్యాన్ని దాచేస్తారని మండిపాటు
  • ధరలు పెరిగి మధ్య తరగతికి ఇబ్బందులొస్తాయని వ్యాఖ్య
  • పంజాబ్, హర్యానా రైతులు దేశభక్తులన్న కాంగ్రెస్ మాజీ చీఫ్
  • ‘వ్యవసాయం ఖూనీ’ అనే పుస్తకం విడుదల
ప్రస్తుతం దేశం అత్యంత విషాద పరిస్థితుల్లో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం నలుగురైదుగురి చేతుల్లోనే నడుస్తోందని ఆరోపించారు. ఎయిర్ పోర్టులు, విద్యుత్, టెలికాం రంగాల్లో వారి ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు వ్యవసాయ రంగంపైనా వారి కన్ను పడిందని అన్నారు. మంగళవారం ఆయన ‘వ్యవసాయం ఖూనీ’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

దేశ వ్యవసాయ రంగాన్ని సాగు చట్టాలు నాశనం చేస్తాయని మండిపడ్డారు. దేశమంతా క్రోనీ క్యాపిటలిస్టుల (ఆశ్రిత పెట్టుబడిదారులు) చేతుల్లోనే ఉందని, వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. వారికి మీడియా మద్దతును ఇస్తోందన్నారు.

సాగు చట్టాలతో మార్కెట్ వ్యవస్థ నాశనం అవుతుందని, నిత్యావసర సరుకుల చట్టాన్ని తుంగలోకి తొక్కేస్తుందని ఆరోపించారు. అంతేగాకుండా రైతులు తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లకుండా కూడా వ్యవసాయ చట్టాలు అడ్డుకుంటాయన్నారు. చట్టాలతో రైతులకు మద్దతు ధర లభించదన్నారు.

ఈ చట్టాల వల్ల వ్యవసాయం మొత్తం ఆ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోకే వెళ్తుందన్నారు. కొన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని క్రోనీ క్యాపిటలిస్టులే నిల్వ చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు. దాని వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని, ధరలు ఊహించనంతగా పెరుగుతాయని హెచ్చరించారు. ఈ గుత్తాధిపత్యానికి తెర దించాల్సిన అవసరం ఉందన్నారు.

పంజాబ్, హర్యానా రైతులు దేశభక్తులని, ఈ దేశ బతుకుదెరువును కాపాడేందుకు పోరాడుతున్నారని అన్నారు. ప్రజల కోసమే రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి అందరూ మద్దతునివ్వాలని రాహుల్ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
Rahul Gandhi
Farm Laws
Congress

More Telugu News