Brazil: మరో వేషం కట్టిన కరోనా.. బ్రెజిల్​ రకంపై శాస్త్రవేత్తల ఆందోళన!

  • రోగనిరోధక శక్తికి దొరకని ‘పీ1’
  • ఒకే దాంట్లో 10 జన్యు మార్పులు
  • సోకినోళ్లకూ మళ్లీ సోకే ప్రమాదం
  • జన్యు క్రమాన్ని విశ్లేషిస్తున్న భారత శాస్త్రవేత్తలు
Brazil strain causes concern among health experts

కరోనా మరో వేషం కట్టింది. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. రోగ నిరోధక శక్తికి దొరకకుండా తప్పించుకు తిరుగుతోంది. మొన్నటికి మొన్న బ్రిటన్ లో ఓ కొత్త రకం కరోనా బయటపడితే.. ఆ వెంటనే దక్షిణాఫ్రికాలో ఇంకో రకం వెలుగు చూసింది. ఇప్పుడు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో మరో రూపానికి మారింది. ప్రపంచ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది.

పీ1గా పిలుస్తున్న ఆ కొత్త రకం కరోనాలో 10 జన్యుమార్పులను (మ్యుటేషన్లు) గుర్తించారు సైంటిస్టులు. ఇప్పుడు వాటి జన్యు క్రమాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు భారత శాస్త్రవేత్తలు. ఇతర రకపు కరోనాల్లో లాగానే బ్రెజిల్ కరోనా పీ1లోనూ ఎన్నెన్నో జన్యు మార్పులు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం మన దేశంలో ‘బ్రెజిల్ కరోనా’ కేసులు లేనప్పటికీ.. ఆరోగ్య రంగ నిపుణులు ముందే అప్రమత్తమయ్యారు. బ్రెజిల్ లో డిసెంబర్ లోనే పీ1ను గుర్తించినా.. వారం క్రితం దాకా ప్రపంచానికి తెలియలేదు. జపాన్ కు వచ్చిన బ్రెజిల్ ప్రయాణికులకు టెస్ట్ చేస్తే నలుగురిలో ఈ కొత్త రకం ఆనవాళ్లు కనిపించాయి.

దీని వల్లే ఇప్పుడు బ్రెజిల్, జపాన్ లలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రెజిల్ లోని మనౌస్ నగరంలో ఆస్పత్రుల్లో పడకలూ చాలట్లేదు. పరిస్థితి విషమించిన పేషెంట్లకు ఆక్సిజన్ పెడదామన్న దొరకట్లేదు. అక్కడ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. చనిపోయిన వారి దేహాలను భద్రపరచడానికీ మార్చురీల్లో చోటు చాలడం లేదు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను తెప్పించి అందులో పెడుతున్నారు.

17 మార్పులు

వైరస్ లోని అమైనో యాసిడ్ లో 17 మార్పులు జరిగినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ లోని జన్యువుల్లో మూడు పోయాయని, నాలుగు ఏకరూప మ్యుటేషన్లున్నాయని గుర్తించారు. ప్రొటీన్ కొమ్ముల్లో పది మ్యుటేషన్లు జరిగాయని తేల్చారు. మొత్తంగా దాని పది రూపాలను బయటపెట్టారు. ఈ484కే, ఎన్501వై, ఎల్18ఎఫ్, టీ20ఎన్, పీ26ఎస్, డీ138వై, ఆర్190ఎస్, కే417టీ, హెచ్655వై, టీ1027ఐ గా తేల్చారు. ఇప్పటికే బ్రిటన్  రకం కరోనాలో ఎన్501వై, దక్షిణాఫ్రికా రకం కరోనాతో ఈ484కే మ్యుటేషన్లను గుర్తించారు. ఈ484కే రకం రోగనిరోధక శక్తికి దొరక్కుండా తప్పించుకుంటోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా ప్రొటీన్ కొమ్ముల్లో మార్పులు చూస్తుంటే మొత్తం మరో కొత్త రకం కరోనా వచ్చేలా కనిపిస్తోందని సంక్రమిత వ్యాధుల పరిశోధకుడు డాక్టర్ నూనో ఆర్ ఫారియా చెప్పారు. దీని వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. ఒకసారి కరోనా సోకినోళ్లకూ ఇది మళ్లీ అంటుకునే ముప్పు ఉందన్నారు. ప్రస్తుతం ఆయన బ్రెజిల్ కరోనా క్రమాన్ని విశ్లేషిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల కరోనా జన్యు క్రమాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓ వైరస్ మీద ఇంత పెద్ద ఎత్తున పనిచేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

More Telugu News