Bihar: 'సైకిల్ గాళ్' జ్యోతికి మరో గౌరవం.. ప్రచారకర్తగా నియమించిన బీహార్ ప్రభుత్వం

Cycle girl jyothi kumari appointed as brand ambassador
  • గురుగ్రామ్ నుంచి బీహార్‌కు సైకిల్‌పై తండ్రిని తీసుకొచ్చిన జ్యోతి
  • ‘కంప్లీట్ స్టాప్ ఆన్ డ్రగ్స్’ ప్రచారకర్తగా నియమించిన ప్రభుత్వం
  • సన్మానించి రూ. 50 వేల చెక్ అందించిన అధికారులు
బీహార్ సైకిల్ గాళ్ జ్యోతికి మరో గౌరవం దక్కింది. బీహార్ ప్రభుత్వం ఆమెను ‘కంప్లీట్ స్టాప్ ఆన్ డ్రగ్స్’ ప్రచారకర్తగా నియమించింది. బీహార్‌లోని దర్బాంగకు చెందిన జ్యోతి కుమారి పేరు గతేడాది మార్మోగిపోయింది.

లాక్‌డౌన్ కారణంగా గురుగ్రామ్‌లో చిక్కుకుపోయి, అనారోగ్యం పాలైన తండ్రిని స్వగ్రామం తీసుకెళ్లేందుకు జ్యోతి సాహసం చేసింది. సైకిల్‌పై తండ్రిని వెనక కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి బయలుదేరింది. వారం రోజులపాటు అవిశ్రాంతంగా సైకిల్ తొక్కుతూ ఎట్టకేలకు ఇల్లు చేరుకుంది. తన సాహసంతో జ్యోతి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

జ్యోతి సాహసానికి ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది. తాజాగా, ప్రభుత్వం  ఆమెను ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా సోషల్ సెక్యూరిటీ డైరెక్టర్ దయానిధన్ పాండే మాట్లాడుతూ.. జ్యోతి సాహసాన్ని గుర్తించి ఆమెను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు చెప్పారు. ఆమెను సన్మానించి రూ. 50 వేల చెక్కును అందించినట్టు తెలిపారు. యువతరానికి జ్యోతి ఒక స్ఫూర్తి అని కొనియాడారు.
Bihar
Cycle Girl
Jyothi Kumari
Brand Ambassador

More Telugu News