Nitish Kumar: ఎవరికి సపోర్ట్ చేస్తున్నావ్?: జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నితీశ్ కుమార్

Who Are You Supporting Nitish Kumars Outburst Over Murder Case
  • బీహార్ లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ హత్య
  • ఎన్డీటీవీ రిపోర్టర్ ప్రశ్నకు సహనం కోల్పోయిన నితీశ్ కుమార్
  • ఎలాంటి తప్పు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్న నితీశ్
ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటూ, నవ్వుతూ కనిపించే నితీశ్ కుమార్ సహనాన్ని పూర్తిగా కోల్పోయారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక రిపోర్టర్ పై నిప్పులు చెరిగారు. ''మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య బీహార్ లో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. నితీశ్ కుమార్ నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే రూపేశ్ కుమార్ నివాసం ఉంటుంది. ఆయనను ఇంటి గేటు వద్ద దుండగులు కాల్చి చంపారు. దీంతో, మిత్రపక్షమైన బీజేపీ నేతలు సైతం నితీశ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేనేలేవంటూ నితీశ్ ను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులను సైతం ఆయన నియంత్రించలేకపోతున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఇక విపక్షాల సంగతి సరేసరి. నితీశ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా... ఎన్డీటీవీ రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్నకు నితీశ్ సహనం కోల్పోయారు. 'మీరు చాలా గొప్పవారు. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మీరు ఎవరికి మద్దతిస్తున్నారు. వారు (లాలాూ, రబ్రీదేవి) 15 సంవత్సరాలు పాలించారు. భార్యాభర్తల హయాంలో ఎన్నో నేరాలు జరిగాయి. వాటిని మీరెందుకు లేవనెత్తడం లేదు. ఎలాంటి తప్పిదం జరిగినా మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.

మీరు అడిగిన ప్రశ్న పూర్తిగా తప్పు. జరిగిన ఘటనను అపరాధంగా భావించకండి. అక్కడ జరిగింది ఒక హత్య. ప్రతి హత్య వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ హత్య వెనుక గత కారణాన్ని కూడా కనుక్కోవాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం అదే పని మీద ఉన్నారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వండి. పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయవద్దు' అని నితీశ్ అన్నారు.
Nitish Kumar
Bihar
JDU
Indigo Airlines
Murder

More Telugu News