USA: అమెరికాలో 8 గొరిల్లాలకు కరోనా.. లాక్‌డౌన్‌లో ఉన్నా ఎలా సోకిందబ్బా?
- గొరిల్లాలకు కరోనా సోకడం ప్రపంచంలోనే తొలిసారి
- గత నెల 6 నుంచి లాక్‌డౌన్‌లో కాలిఫోర్నియా
- సిబ్బంది ద్వారానే వైరస్ సోకి ఉంటుందని నిర్ధారణ
అమెరికా, శాండియాగోలోని సఫారీ పార్కులో ఉన్న 8 గొరిల్లాలకు కరోనా సోకడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత నెల ఆరో తేదీ నుంచి కాలిఫోర్నియాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో పార్క్‌ను కూడా మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. అయినప్పటికీ గొరిల్లాలకు కరోనా వైరస్ ఎలా సోకిందన్నది అధికారులకు అంతుబట్టడం లేదు.
అయితే, సిబ్బంది ద్వారానే వాటికి అది సోకి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే జూ సిబ్బందిలో ఒకరు ఇటీవల కరోనా బారినపడ్డారు. బహుశా అతని ద్వారానే ఈ మహమ్మారి వాటికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. గొరిల్లాలకు కరోనా సోకడం ప్రపంచంలోనే ఇది తొలిసారని జంతు వైద్య నిపుణులు చెబుతున్నారు.