China: కొత్తగా కరోనా కేసులు: చైనాలో రెండు సిటీలు సీజ్.. నిర్బంధంలో 1.80 కోట్ల మంది ప్రజలు

China Seals Off 2 Cities With 11 Million People To Squash Virus Outbreak
  • రెండు నగరాలకు పూర్తిగా రాకపోకలు బంద్
  • అందరికీ టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
  • విదేశాల నుంచే వైరస్ వచ్చిందంటున్న వైద్యాధికారి
కరోనా పుట్టుకకు కారణమైన చైనాలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయనే సంగతి ఎవరికీ తెలియదు. కేసుల వివరాలను ఆ దేశ ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచుతోంది. బయటి ప్రపంచానికి మాత్రం చాలా తక్కువ కేసులు నమోదైనట్టు చూపుతోంది. మరోవైపు చైనాలో ఇప్పటికీ కరోనా వైరస్ పై ఆందోళన కొనసాగుతోంది. తాజగా రెండు నగరాలపై ఆ దేశం తీసుకున్న కఠిన చర్యలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

బీజింగ్ కు దక్షిణాన ఉన్న రెండు సిటీలను చైనా పూర్తిగా సీజ్ చేసింది. ఆ నగరాలకు రవాణా వ్యవస్థను కూడా ఆపేసింది. బయటి వారు అక్కడకు వెళ్లడానికి, అక్కడున్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చేసింది. దీనికంతటికీ కారణం కరోనానే.

అక్కడి అధికారులు చెపుతున్న దాని ప్రకారం హెబీ ప్రావిన్స్ లోని షిజియాజువాంగ్ నగరంలో తాజాగా 127 కరోనా కేసులు బయటపడ్డాయి. వీటికి తోడు అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్న మరో 183 మందిని గుర్తించారు. ఈ సిటీకి పక్కనే ఉన్న జింగ్టాయ్ నగరంలో కూడా తొమ్మిది కేసులు బయటపడ్డాయి. ఈ కేసులు అక్కడి అధికారులు అఫీషియల్ గా ప్రకటించినవి మాత్రమే. అనధికారికంగా ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో, ఈ రెండు సిటీలను చైనా సీజ్ చేసింది. తద్వారా వైరస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు నగరాల్లో దాదాపు 1.80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు.

ఈ రెండు నగరాలు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిటీని విడిచి వెళ్లడానికి వీల్లేదని అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా హెబీ ప్రావిన్స్ వైద్యాధికారి లీక్యీ మాట్లాడుతూ, విదేశాల నుంచే వైరస్ వచ్చిందని, విదేశాల నుంచి వచ్చిన వారివల్లే తాజా కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరెక్ట్ గా ఎక్కడి నుంచి వైరస్ వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని అన్నారు.

ఈ రెండు నగరాలకు కనెక్ట్ అయిన అన్ని రహదారులను మూసివేశారు. ప్రజలను వైద్య సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లి టెస్టులు చేయిస్తున్న సీసీటీవీ ఫుటేజీని అక్కడి అధికారిక మీడియా ప్రసారం చేసింది. మరోవైపు ఈ సిటీల్లోకి ప్రవేశించే ప్రధాన రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద వైద్య సిబ్బందిని మోహరింపజేశారు.
China
Corona Virus
Outbreak
2 Cities
Lockdown

More Telugu News