Sydney Test: మూడో టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట... బౌలింగ్ కు సహకరించని పిచ్!

Sydney test first day between India and Australia
  • భారత్, ఆసీస్ మధ్య ప్రారంభమైన మూడో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • 55 ఓవర్లలో 166/2
  • అర్ధసెంచరీలు సాధించిన పుకోవ్ స్కీ, లబుషేన్
  • సిరాజ్, సైనీకి చెరో వికెట్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన మొదటి రోజు ఆటలో ఆసీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్ కు ఏమాత్రం సహకరించకపోవడంతో వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోడ్చారు. వరుణుడి ప్రభావంతో ఇవాళ కేవలం 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ (6) వికెట్ ను త్వరగానే పడగొట్టిన టీమిండియా... ఆ తర్వాత రెండో వికెట్ కోసం మరో 100 పరుగుల వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. వార్నర్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక, జట్టు స్కోరు 106 పరుగుల వద్ద ఉన్నప్పుడు యువ ఓపెనర్ విల్ పుకోవ్ స్కీ (62) టీమిండియా పేసర్ నవదీప్ సైనీ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో మార్నస్ లబుషేన్ 67, మాజీ సారథి స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. దారుణమైన ఫామ్ లో ఉన్న స్మిత్ కూడా 5 ఫోర్లు బాదాడంటే పిచ్ ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. పేసర్లకు ఎంతో ముఖ్యమైన బౌన్స్ రాకపోగా, స్పిన్నర్లకు టర్న్ కూడా లభించడంలేదు. తొలి రెండు టెస్టుల్లో ఎంతో ప్రభావం చూపిన అశ్విన్ ఇవాళ్టి ఆటలో సాధారణ బౌలర్ లా కనిపించాడు. దానికితోడు వర్షం కారణంగా మైదానం కొద్దిగా తేమగా మారడంతో బౌండరీలు కొట్టేందుకు బ్యాట్స్ మెన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. బంతి బౌండరీ లైన్ తాకే లోపే ఫీల్డర్లు బంతిని అందుకున్న సందర్భాలు నేటి ఆటలో ఎక్కువగా కనిపించాయి.

కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులో నవదీప్ సైనీ, ఆస్ట్రేలియా జట్టులో విల్ పుకోవ్ స్కీ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేశారు.
Sydney Test
India
Australia
Team India
Cricket

More Telugu News