Tapan Mishra: నాకు విషమిచ్చి చంపాలని చూశారు: ఇస్రో శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ISRO top Scientist Tapan Aligations that he Poisoned
  • మూడేళ్ల క్రితం ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో ఘటన
  • హోమ్ శాఖ వెంటనే స్పందించింది
  • మెడికల్ రిపోర్టులు సహా ఫేస్ బుక్ లో పోస్ట్
  • సంచలనం కలిగిస్తున్న మిశ్రా ఆరోపణలు

తనకు విషమిచ్చి చంపాలని ప్రయత్నించారంటూ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉన్నతస్థాయి సైంటిస్టుల్లో ఒకరైన తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ ను తనపై మే 23, 2017న ప్రయోగించారని, తాను ఆ సమయంలో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలోనే ఉన్నానని చెప్పారు. ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో ఈ ఘటన జరిగిందని, దోశ, చట్నీలో విషాన్ని కలిపి ఇచ్చారని ఆరోపించారు.

ఈ మేరకు లాంగ్ కెప్ట్ సీక్రెట్ (సుదీర్ఘకాలం దాచిన నిజం) టైటిల్ తో తన ఫేస్ బుక్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మిశ్రా ఇస్రో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. అంతకుముందు ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ గానూ పనిచేశారు. 2017 జూలైలో కేంద్ర హోమ్ శాఖ భద్రతా సిబ్బంది తనను కలిసి, విషప్రయోగం గురించి చెప్పారనీ, ఆ వెంటనే తనకు విరుగుడు మందులు ఇచ్చి, చికిత్స చేయించారని మిశ్రా తెలిపారు.

ఆ తరువాత తనను ఎన్నో శారీరక సమస్యలు బాధించాయని వెల్లడించిన ఆయన, ఆ సమయంలో ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యేదని, చర్మంపై దద్దుర్లు వచ్చేవని, ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును సైతం ఆయన పోస్ట్ చేయడం గమనార్హం. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆర్సెనిక్ టాక్సికేషన్ ను మిశ్రాలో గుర్తించినట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుండటం గమనార్హం.

ఇది ఎవరో గూఢచారులు చేసిన పనిగా తాను భావిస్తున్నానని, మిలిటరీ, కమర్షియల్ రంగాల్లో ఎంతో ఉపకరించే సింథటిక్ అపిర్చ్యూర్ రాడార్ నిర్మాణాన్ని ఆపడం నాటి వారి లక్ష్యం కావచ్చని అన్నారు. ఈ మొత్తం ఘటనపై భారత ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే, విష ప్రయోగం జరిగిన మూడేళ్ల తరువాత తాను ఈ విషయాన్ని ఎందుకు వెల్లడిస్తున్నారన్న సంగతిని మాత్రం మిశ్రా పంచుకోకపోవడం గమనార్హం. కాగా, శాస్త్రవేత్త మిశ్రా ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నారు.

  • Loading...

More Telugu News