Corona Virus: భారత్ లో ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

India will roll out corona vaccine in a few days
  • ఈ నెల 3న వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతులు
  • అనుమతి వచ్చిన 10 రోజుల్లో పంపిణీ ఉంటుందన్న కేంద్రం
  • ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • డ్రై రన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా పంపిణీ ఉంటుందని వెల్లడి
అన్నీ సజావుగా జరిగితే జనవరి 13 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోగా పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన 'డ్రై రన్' ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే సంయుక్తంగా తమ సన్నద్ధతను వెల్లడించడం కేంద్రం ప్రకటనకు బలం చేకూర్చుతోంది.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ నెల 3న అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటన అతిపెద్ద ఊరట అని చెప్పాలి. అమెరికా తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైంది భారత్ లోనే. అధిక జనాభా ఉండడంతో వ్యాప్తి కూడా అందుకు తగ్గట్టుగానే కొనసాగింది. వ్యాక్సిన్ రాకతో దేశ ప్రజలకు తగిన భద్రత కలుగుతుందని విశ్వసిస్తున్నారు.
Corona Virus
Vaccine
India
Distribution
COVAXIN
Covishield

More Telugu News