Chandrababu: మత మార్పిడులు చేయించే అధికారం జగన్ కు ఎవరిచ్చారు?: చంద్రబాబు

Who gave permission to Jagan fo religious conversions questions Chandrababu
  • రామతీర్థం ఘటన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏం గడ్డి పీకింది
  • దేవాలయాలను ప్రభుత్వం కాపాడుతుందనే నమ్మకం పోయింది
  • భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు
రామతీర్థంకు వెళ్లేందుకు తమకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి... మార్గమధ్యంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రామతీర్థంలో దారుణ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని... తాము పర్యటన చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో భయం ప్రారంభమైందని అన్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం ఏం గడ్డి పీకిందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలను ప్రభుత్వం కాపాడుతుందనే నమ్మకం పోయిందని... మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని ఆయన అన్నారు.

గ్రామాల్లో చర్చిలు పెరిగిపోతున్నాయని... ఈ విషయంపై హిందువులు ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో మతమార్పిడులు పెరిగిపోయాయని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి జగన్ ప్రమాణం చేశారని... ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చెప్పారు. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. ఏపీలో హిందువులతో పాటు ముస్లింలపై కూడా దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన హిందూ దేవాలయాలపై జరుగున్న దాడులను ఆపరా? అని చంద్రబాబు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క మసీదు, చర్చిపై దాడి జరగలేదని అన్నారు. మతమార్పిడులు చేయించే అధికారం జగన్ కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై కూడా విమర్శలు చేయడం దారుణమని అన్నారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Temples
Bharat Biotech

More Telugu News