Aravind: పాపం కేసీఆర్... ఇంకా మూడేళ్లు బండి సంజయ్ ని ఎలా తట్టుకుంటారో ఏమో!: ఎంపీ అరవింద్

MP Aravind praises Bandi Sanjay leadership qualities
  • బీజేపీలో భారీగా చేరికలు
  • టీఆర్ఎస్ ను వీడి కాషాయా కండువా కప్పుకున్న వైనం
  • కేసీఆర్ ఎప్పుడో తెలంగాణ అజెండా వదిలేశాడన్న అరవింద్
  • 2023లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా
ఇవాళ తెలంగాణ బీజేపీలో భారీ చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ ను వీడి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చినవారు టీఆర్ఎస్ పంథాతో విసిగిపోయారని, ఇంతకుముందు గులాబీ జెండా మోశామని, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబ అజెండా మోయలేక బీజేపీలో చేరినట్టు వారు చెబుతున్నారని అరవింద్ వివరించారు.

కేసీఆర్ ఎప్పుడో తెలంగాణ అజెండాను వదిలేశారని, 2023 నాటికి టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల్లోంచి వస్తున్న సంకేతాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పాపం కేసీఆర్... ఇంకా మూడేళ్లు బండి సంజయ్ ని ఎలా తట్టుకుంటారో ఏమో అని అరవింద్ వ్యాఖ్యానించారు.

"బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 9 నెలలు అవుతోంది. ఆయన తన నాయకత్వ లక్షణాలతో అద్భుతంగా దూసుకుపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలే అందుకు నిదర్శనం. 2023 వరకు బండి సంజయ్ ని తట్టుకోవడం కేసీఆర్ కు కష్టమే. ఆ తర్వాత ఎలాగూ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు. కేటీఆర్ ను డైనమిక్ లీడర్ అంటున్న టీఆర్ఎస్ నాయకులే పరోక్షంగా కేసీఆర్ నాయకత్వ పటిమ  పడిపోయిందంటున్నారు" అని అరవింద్ వ్యాఖ్యానించారు.
Aravind
Bandi Sanjay
KCR
BJP
TRS
Telangana

More Telugu News