Somireddy Chandra Mohan Reddy: అశోక్ గజపతిరాజు గారిని మంత్రులు నీచమైన భాషలో దూషించడం సహించరాని విషయం: సోమిరెడ్డి

Somireddy warns AP Ministers over Ashok Gajapathi Raju issue
  • రామతీర్థం ట్రస్టు చైర్మన్ గా అశోక్ గజపతిరాజుపై వేటు
  • వెధవ అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి
  • అశోక్ ఎన్నో గుడులు, విద్యాలయాలు నిర్మించారన్న సోమిరెడ్డి
  • మంత్రులు తీరు మార్చుకోవాలని హెచ్చరిక
విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన సంఘటనలకు బాధ్యుడ్ని చేస్తూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజును ట్రస్టు చైర్మన్ గా తొలగించడం తెలిసిందే. అంతేకాదు, అశోక్ గజపతిరాజుపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఇలాంటి వెధవను చైర్మన్ గా ఉంచాలా?" అని అశోక్ గజపతిరాజును ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

దీనిపై, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎన్నో గుడులు, విద్యాసంస్థలు నిర్మించిన అశోక్ గజపతిరాజు గారిని మంత్రులు నీచమైన భాషలో దూషించడం సహించరాని విషయం అని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలతో హిందువులే కాదు, ప్రజలందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే బాధ్యత వహించి పదవి నుంచి వైదొలగాల్సిన మంత్రి... ఆ గుడులను కట్టిన నిష్కళంకుడైన అశోక్ గజపతిరాజు గారిని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి తొలగిస్తారా? పైగా నోటికొచ్చినట్టు దూషిస్తారా? అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీ తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు" అంటూ హెచ్చరించారు.
Somireddy Chandra Mohan Reddy
Ashok Gajapathi Raju
Vellampalli Srinivasa Rao
YSRCP
Ramatheertham
Telugudesam
Andhra Pradesh

More Telugu News