Sunil Deodhar: ఓ ఎంపీగా ఏం చేద్దామని విజయసాయిరెడ్డి రామతీర్థం వెళ్లారు?: సునీల్ దేవధర్

Sunil Deodhar fires on YCP top leaders over Ramatheertham matter
  • రామతీర్థంలో విజయసాయి పర్యటన
  • రామతీర్థంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందన్న దేవధర్
  • లోపాలను కప్పిపుచ్చేందుకే విజయసాయి పర్యటన అంటూ వ్యాఖ్యలు
  • జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తీవ్ర నిరసనలు, రాళ్లు, చెప్పుల దాడి నడుమ రామతీర్థంలో పర్యటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రామతీర్థంలో పర్యటించడం లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమేనని విమర్శించారు. రామతీర్థంలో ఏర్పడింది శాంతిభద్రతల సమస్య అయితే ఎంపీగా అక్కడ ఏంచేద్దామని వెళ్లారని ప్రశ్నించారు. ఓ ఎంపీ అక్కడ చేయడానికి ఏముందని నిలదీశారు.

రామతీర్థానికి ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా రాలేదని సునీల్ దేవధర్ మండిపడ్డారు. శాంతిభద్రతలను కూడా పర్యవేక్షించే సీఎం జగన్ సైతం ఆలయాలపై దాడుల పట్ల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందినవాళ్లు ఎవరో ఒకరు కాకుండా, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అటు, రామతీర్థంలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కార్యకర్తల అరెస్టులను, ప్రభుత్వ వైఖరిని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
Sunil Deodhar
Vijay Sai Reddy
Jagan
Ramatheertham
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News