Ganguly: గంగూలీకి యాంజియోప్లాస్టీ.. హెల్త్ బులెటిన్ విడుదల!

  • ట్రెడ్ మిల్ పై ఎక్సర్ సైజ్ చేస్తుండగా గుండెపోటు
  • ప్రస్తుతం నిలకడగా ఉన్న గంగూలీ ఆరోగ్యం
  • మరో 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్న వైద్యులు
Sourav Ganguly Stable After Angioplasty

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయనను కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేర్పించారు. గంగూలీ ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి వైద్యులు కాసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గంగూలీకి విజయవంతంగా యాంజియోప్లాస్టీ నిర్వహించామని బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తన ఇంట్లో ఉన్న జిమ్ లో ట్రెడ్ మిల్ పై ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు.
 
గంగూలీ కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిశీలిస్తే... వంశపారంపర్యంగా వారికి గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గంగూలీని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. సరైన సమయంలో ఆయనను తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో గంగూలీ బీపీ 130/80 గా ఉందని... నాడి నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటోందని చెప్పారు. మిగిలినవన్నీ నార్మల్ గానే ఉన్నాయని వెల్లడించారు. గంగూలీ పూర్తి స్పృహలో ఉన్నారని, ఆయనను మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.

మరోవైపు గంగూలీకి గుండెపోటు వచ్చిందనే వార్త వినగానే చాలా బాధ కలిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గంగూలీకి గుండెపోటు వచ్చిందనే వార్తతో పలువురు క్రికెట్ దిగ్గజాలు షాక్ కు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలను పోస్ట్ చేశారు.

More Telugu News