America: డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర అవమానం.. వీటో అధికారాలను లాగేసుకున్న కాంగ్రెస్!

American senate overrides Trump veto rights
  • కీలక రక్షణ బిల్లుకు అభ్యంతరాలు చెబుతూ జాప్యం
  • వీటో అధికారాన్ని తిరగరాసిన కాంగ్రెస్
  • మరో 8 బిల్లులకు మాత్రం దక్కని ఆమోదం
మరికొన్ని రోజుల్లో అధికార పీఠం నుంచి తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర అవమానం ఎదురైంది. కీలక రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ జాప్యానికి కారణమవుతున్న ఆయనకు కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది.

అధ్యక్షుడి వీటో అధికారాన్ని తిరగరాసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా ఇందుకు మద్దతు పలకడం గమనార్హం. ప్రతినిధుల సభలోనూ ట్రంప్‌కు ఇలాంటి అవమానమే ఎదురైంది.

వీటో అధికారాన్ని కోల్పోవడంపై ట్రంప్ స్పందిస్తూ.. మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని సెనేట్ చేజార్చుకుందని అన్నారు. మరోవైపు, సెనేట్ ఆమోదంతో వీటో బిల్లు చట్టంగా మారింది. ఫలితంగా 740.5 బిలియన్ డాలర్ల రక్షణ విధానానికి మార్గం క్లియర్ అయింది.

అంతేకాదు, లక్షలాదిమంది అమెరికా సైనికులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. ‘హజార్డస్ డ్యూటీ పే’ కింద ఇప్పటి వరకు చెల్లించిన నెలవారీ భృతి 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెరగనుంది. కాగా, ట్రంప్ తన వీటో అధికారంతో మరో 8 బిల్లులను అడ్డుకోగా, వాటికి చట్టసభల్లో తగినంత మెజారిటీ సాధించడంలో విఫలం కావడంతో అవి చట్టంగా మారలేదు.
America
Congress
Senate
Veto
Donald Trump

More Telugu News