Experts Committee: దేశంలో కరోనా వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి కోసం సమావేశమైన నిపుణుల కమిటీ
- కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న భారత్ బయోటెక్, సీరం సంస్థ
- అత్యవసర అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి
- ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం
- కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఓ ఉద్యమంలా సాగుతోంది. కరోనా ధాటికి అతలాకుతలమైన అనేక దేశాలు వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి. మోడెర్నా, ఫైజర్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లు ఇప్పటికే అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే భారత్ లో ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వలేదు.
ఇటీవలే తమ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేయాలంటూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ అభ్యర్థనపై చర్చించేందుకు నిపుణుల కమిటీ నేడు సమావేశమైంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయమై కమిటీ చర్చిస్తోంది. మరికాసేపట్లో కమిటీ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది.
దీనిపై ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమానీ కూడా సానుకూల సంకేతాలు వెలువరించారు. దేశ ప్రజలు శుభవార్త వింటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్ సహకారంతో కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అటు, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.