BJP: జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ

BJP and TRS workers fight in Jagityal dist Gollapalli
  • బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగింపు
  • ఎంపీడీవో కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల నిరసన
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో నిన్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటివల్ల ఒనగూరిన ప్రయోజనాలను వివరిస్తూ బస్టాండ్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారులు తొలగించడం ఈ గొడవకు కారణమైంది. ఫ్లెక్సీని తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

అదే సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆర్యవైశ్య భవన్‌కు వస్తున్నట్టు తెలిసి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. సమాచారం అందుకున్న ఎస్సై జీవన్ ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
BJP
Telangana
Jagityal
Gollapalli
TRS

More Telugu News