Perni Nani: సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి.. టీడీపీ హయాంలోనే రెండు కేసుల్లో శిక్ష పడింది: పేర్ని నాని

There are 14 police cases on Subbaiah says Perni Nani
  • హత్యా రాజకీయాలతో ఎదిగిన చరిత్ర చంద్రబాబుది
  • ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారు
  • ఫ్యాక్షన్ రాజకీయాలే సుబ్బయ్యని పొట్టన పెట్టుకున్నాయి
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న స్థలంలోనే ఆయనను హతమార్చారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన చరిత్ర చంద్రబాబుదని పేర్ని నాని అన్నారు. అలాంటి వ్యక్తి హత్యా రాజకీయాలంటూ ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సుబ్బయ్య హత్యపై విచారణ జరుగుతోందని.. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం కూడా సరికాదని అన్నారు. సుబ్బయ్యపై 2002 నుంచి ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని... టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కేసుల్లో ఆయనకు శిక్ష పడిందని చెప్పారు.

ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించింది చంద్రబాబేనని పేర్ని నాని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిని కూడా వదిలేసిన చరిత్ర వైయస్ కుటుంబానిదని చెప్పారు. చంద్రబాబు చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలే ఈరోజు సుబ్బయ్యను పొట్టన పెట్టుకున్నాయని అన్నారు. ఇదే సమయంలో నారా లోకేశ్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఈ మధ్యే కొవ్వు తగ్గించుకున్నారని, మదం కూడా తగ్గించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎవరో రాసిచ్చిన వాటిని ట్వీట్లు చేయడం కాదని... వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.
Perni Nani
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
Subbaiah
Proddutur

More Telugu News