Astrazeneca: ఆక్స్​ ఫర్డ్​ కరోనా వ్యాక్సిన్​ కు బ్రిటన్​ అనుమతులు

Covid19 Oxford AstraZeneca coronavirus vaccine approved for use in UK
  • అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం
  • వెల్లడించిన ఆ దేశ ఆరోగ్య శాఖ
  • త్వరలోనే మన దేశంలోనూ అనుమతించే అవకాశం
ఆక్స్ ఫర్డ్– ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చేసింది. ఇప్పటికే ఫైజర్– బయోఎన్టెక్ లు తయారు చేసిన బీఎన్ టీ162బీ2కు అనుమతిచ్చిన ఆ దేశ ప్రభుత్వం.. ప్రజలకు ఆ టీకాను ఇస్తోంది. అయినా, కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు ఆమోద ముద్ర వేసింది.

‘‘ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులిచ్చింది’’ అని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు 5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేలా 10 కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డర్ పెట్టింది. కొత్త సంవత్సరంలో వీలైనంత త్వరగా జనానికి వ్యాక్సిన్ వేస్తామని ఆస్ట్రాజెనికా సీఈవో పాస్కల్ సోరియట్ చెప్పారు. వ్యాక్సిన్ కు అనుమతులిచ్చిన బ్రిటన్ ప్రభుత్వం, తయారీలో భాగస్వాములైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

మహమ్మారి వ్యాపించిన మొదట్లోనే టీకా అభివృద్ధిని మొదలుపెట్టింది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. డిసెంబర్ నాటికే తెస్తామని ప్రకటించింది. అనుకున్న టైంకు వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్రిటన్ అనుమతినిచ్చిన నేపథ్యంలో భారత్ లోనూ మరికొన్ని రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. బ్రిటన్ అనుమతినిచ్చాక మన దగ్గరా అనుమతినిస్తారని కొన్ని రోజులుగా అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే.
Astrazeneca
Oxford University
COVID19
Covishield
UK

More Telugu News