Virat Kohli: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ.... ధోనీకి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు

Kohli won ICC Best Cricketer of the Decade
  • ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల ప్రకటన
  • తిరుగులేని కోహ్లీ
  • సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు ఎంపిక
  • 2011 నాటి ఘటనతో ధోనీకి అవార్డు
పురుషుల, మహిళల క్రికెట్ రంగాల్లో ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ ప్రకటించింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద కోహ్లీకి సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందివ్వనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్న కాలంలో కోహ్లీ మొత్తం 20,396 పరుగులు సాధించాడు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో 66 సెంచరీలు, 94 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. మరే క్రికెటర్ కు సాధ్యం కాని రీతిలో సూపర్ ఫామ్ కొనసాగించాడు. కాగా, కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.

ఇక టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు లభించింది. 2011లో నాటింగ్ హామ్ లో ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టెస్టులో ఇంగ్లీష్ ఆటగాడు ఇయాన్ బెల్ ను మొదట రనౌట్ గా ప్రకటించారు. అప్పటికి బెల్ 137 పరుగులు చేశాడు. బెల్ ఓ బంతికి షాట్ ఆడగా అది బౌండరీ వద్దకు వెళ్లింది. అయితే ఫీల్డర్ అభినవ్ ముకుంద్ బంతిని త్రో చేయగా, బెల్ రనౌటయ్యాడు.

వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే... బెల్ షాట్ ఆడగా బంతి బౌండరీ లైన్ తాకింది. ఈ విషయం గమనించని ముకుంద్ త్రో చేయగా, బెల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న అప్పటి కెప్టెన్ ధోనీ ఎంతో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇయాన్ బెల్ ను మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. క్రికెట్ స్ఫూర్తికి ఈ ఘటన అద్దంపట్టేలా నిలిచింది. నాటి ఆ సుహృద్భావ చర్యతో ఇవాళ ధోనీ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు.

ఇక ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20 ఆటగాడిగా రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) ఎంపికయ్యారు. మహిళల క్రికెట్లో ఈ దశాబ్దపు అత్యుత్త మహిళా క్రికెటర్ గా ఆసీస్ ఆల్ రౌండర్ ఎలిస్సే పెర్రీ అవార్డు కైవసం చేసుకుంది.
Virat Kohli
MS Dhoni
ICC
Best Of The Decade

More Telugu News