Pawan Kalyan: మీ జగన్ సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి: గుడివాడ జంక్షన్లో నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

Pawan Kalyan warns Jagan
  • రైతులకు వెంటనే రూ. 10 వేలు విడుదల చేయాలి
  • అసెంబ్లీ సమావేశాల్లోగా రూ. 35 వేలు ఇవ్వాలి
  • లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు గుడివాడ జంక్షన్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పవన్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'శతకోటి నానీల్లో ఒక నాని' అని ఎద్దేవా చేశారు.  

'ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? నానీనా? వైసీపీలో నానీలు ఎక్కువమ్మా. ఏదో ఒక నాని. ఏ నానీనో నాకు అర్థం కావడం లేదు. గుర్తు కూడా లేదు. శత కోటి లింగాల్లో బోడి లింగం. అనేక నానీల్లో ఒక నాని. ఎవరైతే మనకేంటి? శత కోటి నానీల్లో ఒక నాని. ఏదో ఒక నాని...  మీ సీఎం సాబ్ జగన్ సాబ్ కి వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి. మీరు రైతులకు వెంటనే రూ. 10 వేలు విడుదల చేస్తారా? నష్టపోయిన రైతులకు అసెంబ్లీ సమావేశాల్లోగా రూ. 35 వేల పరిహారం ఇస్తారా? లేదా? రూ. 35 వేల పరిహారం ఇవ్వకపోతే జనసేన కార్యకర్తలతో కలిసి నేను అసెంబ్లీని ముట్టడిస్తాను.

అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేమూ చూస్తాం. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడినా తగ్గి ఉంటాం. నానా బూతులు మాట్లాడినా భరిస్తాం. మీరు రైతు కన్నీరు తుడవండి. రైతులకు న్యాయం చేయకపోతే వదలిపెట్టం. మీరు అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ లో పెడితే అక్కడకు వస్తాం. పులివెందులలో పెడితే అక్కడకూ వస్తాం. మీరు సై అంటే మేమూ సై. భయపడే ప్రసక్తే లేదు' అని తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News