Joe Biden: ఆర్థిక ఉపశమన బిల్లుపై ట్రంప్ సంతకం చేయకుంటే తీవ్ర పరిణామాలు: జో బైడెన్

Devastating Consequences If Trump Doesnt Sign Covid Aid Bill Joe Biden
  • కోటి మంది ఉపాధి బీమా కోల్పోయే ముప్పుందన్న అమెరికా కొత్త అధ్యక్షుడు
  • ఆలస్యం చేసేకొద్ది చిరు వ్యాపారుల జీవితాలు చీకట్లో పడతాయని ఆవేదన
  • సాయం మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్
కాంగ్రెస్ పాస్ చేసిన ఆర్థిక ఉపశమన బిల్లుపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హెచ్చరించారు. మరింత ఆలస్యం చేయకుండా వెంటనే బిల్లుపై సంతకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘బాధ్యతల నుంచి తప్పించుకు తిరగాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు తప్పవు. ట్రంప్ చర్యల వల్ల దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి బీమా లబ్ధిని కోల్పోతారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ నిధుల కాలపరిమితి ముగుస్తుంది. దాని వల్ల ముఖ్యమైన సేవలు, సైనిక సిబ్బందికి ఇచ్చే వేతనాలు ప్రమాదంలో పడతాయి. మరో వారంలో ఉద్యోగాలు కోల్పోయి బాధల్లో ఉన్న వారికి కల్పించిన మారటోరియం గడువూ పూర్తవుతుంది. లక్షలాది మంది జీవితాలను చీకట్లో పడేస్తుంది’’ అని బైడెన్ మండిపడ్డారు. ఆలస్యం చేసే కొద్దీ చిరు వ్యాపారులకు ఉపాధి దొరక్క బతుకు భారమైపోతుందని, త్వరగా ప్రభుత్వ సాయం అందుతుందని ఎదురు చూస్తున్న లక్షలాది మంది అమెరికన్ల కలలపై నీళ్లు చల్లినట్టవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ట్రంప్ బిల్లుపై సంతకం చేసేలా కన్పించట్లేదు. శనివారం బిల్లుపై మరోసారి స్పందించారు. సాయాన్ని పెంచాలని ట్వీట్ చేశారు. ఇటీవలే సుమారు రూ.66.3 లక్షల కోట్ల (90 వేల కోట్ల డాలర్లు) విలువైన ఉపశమన ప్యాకేజీ బిల్లును అమెరికా కాంగ్రెస్ పాస్ చేసింది. బిల్లుతో మార్చి దాకా ప్రతి వారం ఉపాధి లబ్ధి కింద లక్షలాది మంది అమెరికన్లకు సుమారు రూ.44 వేలు (600 డాలర్లు) అందనున్నాయి. అయితే, ఆ మొత్తం చాలా తక్కువని గత మంగళవారం ట్రంప్ విమర్శించారు. కనీసం రూ.లక్షా 47 వేలు (2 వేల డాలర్లు) ఇవ్వాలని, బిల్లులో దానికి తగ్గట్టు మార్పులు చేయాలని చెప్పారు. లేదంటే బిల్లుపై సంతకం చేసేది లేదన్నారు.
Joe Biden
Donald Trump
America
COVID19

More Telugu News