జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్రం

Centre announce fastags mandatory for vehicles
  • ఓ కార్యక్రమంలో వెల్లడించిన కేంద్రమంత్రి గడ్కరీ
  • ఫాస్టాగ్ తో సమయం, ఇంధనం ఆదా అవుతాయని వెల్లడి
  • 2016లో భారత్ లోకి ఫాస్టాగ్ వ్యవస్థ
  • 2018 నాటికి 34 లక్షల ఫాస్టాగ్ లు జారీ
వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల వద్ద అనుమతిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడాన్నే ఫాస్టాగ్ గా పిలుస్తారు. దీనిద్వారా టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకెళ్లవచ్చు.

దీనిపై నితిన్ గడ్కరీ ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రయాణికులకు ఫాస్టాగ్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, నగదు చెల్లింపుల కోసం వారు టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా చేసుకోనవసరం ఉండదని వివరించారు. పైగా ఇంధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు.

ఫాస్టాగ్ వ్యవస్థను దేశంలో 2016లో తీసుకువచ్చారు. 2018 నాటికి 34 లక్షల ఫాస్టాగ్ లు జారీ అయ్యాయి. ఈ ఏడాది నవంబరులో కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో... పాత వాహనాలకు, 2017 డిసెంబరు 1వ తేదీకి ముందు అమ్ముడైన వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. అంతేకాదు, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 ప్రకారం 2017 డిసెంబరు 1 నుంచి నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ లో ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఓ రవాణా వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలన్నా ఫాస్టాగ్ కలిగివుండాలన్న నిబంధన విధించారు.
Go Back to Shorts
FasTag
India
Nitin Gadkari
Toll Plaza

More Telugu News