Arnab Goswami: పాక్ ప్రజలను కించపరిచేలా అర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలు.. బ్రిటన్ లోని 'రిపబ్లిక్ భారత్' చానల్‌కు రూ. 19 లక్షల జరిమానా

  • ‘పూఛ్‌తా హై భారత్’ కార్యక్రమంలో అర్నాబ్ తీవ్ర వ్యాఖ్యలు
  • పాక్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉగ్రవాదులేనన్నట్టు వ్యాఖ్యానించిన అర్నాబ్
  • అవి ద్వేషపూరిత వ్యాఖ్యలేనన్న ఆఫ్‌కామ్
Arnab Goswami Channel fined Rs 19 lakhs

ఓ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ చానల్ చీఫ్ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామికి చెందిన 'రిపబ్లిక్ భారత్' చానల్‌పై బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ 'ఆఫ్‌కామ్' కొరడా ఝళిపించింది. 19 లక్షల రూపాయల జరిమానా విధించింది.

 బ్రిటన్ లోని హిందీ మాట్లాడేవారి కోసం ఆ దేశంలో అర్నాబ్ నెలకొల్పిన 'రిపబ్లిక్ భారత్' చానల్‌లో గతేడాది సెప్టెంబరు 6న ప్రసారమైన ‘పూఛ్ తా హై భారత్’ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ కార్యక్రమంలో అర్నాబ్ పాకిస్థాన్ ప్రజలను కించపరిచేలా, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆఫ్‌కామ్ ఆరోపించింది. పాకిస్థాన్‌లో పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ఉగ్రవాదులేనన్న అర్థం వచ్చేలా ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్టు ఆఫ్‌కామ్ పేర్కొంది.

అంతేకాదు, ఆ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు కూడా పాక్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని పేర్కొంది. నాటి కార్యక్రమాన్ని మరోమారు ప్రసారం చేయవద్దని ఈ సందర్భంగా ఆఫ్‌కామ్ హెచ్చరించింది.

More Telugu News