Tamil Nadu: సీఎం అభ్యర్థి విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
- పొత్తు నేపథ్యంలో సీఎం అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందన్న మురుగన్
- ఆయన వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయలు
- పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించబోమన్న బీజేపీ
తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎల్ మురుగన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ విషయంలో రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఉన్న భేదాభిప్రాయాలు సమసిపోయినట్టు అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఇటీవల మురుగన్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే శ్రేణులను నిరాశకు గురిచేశాయి.
అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నిర్ణయిస్తారని అక్టోబరు 7న సీఎం పళనిస్వామి ప్రకటించారు. అయితే, కేంద్ర మంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటించిన తర్వాత అన్నాడీఎంకే కన్వీనర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.
అయితే ఇరు పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని మురుగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇరు పార్టీల మధ్య భేదాభ్రిప్రాయాలకు కారణమయ్యాయి. దీంతో స్పందించిన మురుగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని తాము వ్యతిరేకించబోమని ప్రకటించి సమస్యకు ముగింపు పలికారు.