Ratan Tata: సంక్లిష్ట సమయంలో కూడా తడబాటు లేకుండా దేశాన్ని నడిపించారు: మోదీపై రతన్ టాటా ప్రశంసల జల్లు

Ratan Tata praises Modis leadership qualities
  • మీ నాయకత్వం పట్ల ఎంతో గౌరవం ఉంది
  • అద్భుత రీతిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు
  • మీ నాయకత్వ లక్షణాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది
సంక్లిష్ట సమయంలో కూడా ఎలాంటి తడబాటు లేకుండా దేశాన్ని ముందుకు నడిపించారంటూ ప్రధాని మోదీపై పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ప్రశంసలు కురిపించారు. అత్యంత దయనీయమైన కరోనా మహమ్మారి సమయంలో, ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న తరుణంలో... మీరు అందించిన నాయకత్వం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. తడబడకుండా, తప్పించుకోకుండా, దేశాన్ని అద్భుత రీతిలో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ టాటా ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీలో ఉన్న నాయకత్వ పటిమ పైపై మెరుగులతో కూడినది కాదని రతన్ టాటా అన్నారు. అసంతృప్తి, ప్రతిపక్షం అనేవి ఎప్పుడూ ఉంటాయని... కానీ, సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కోవడం గొప్ప విషయమని చెప్పారు. కరోనా సమయంలో దేశాన్ని అష్టదిగ్బంధనం చేశారని, కొన్ని నిమిషాల పాటు దేశ వ్యాప్తంగా దీపాలను ఆర్పివేయాలని పిలుపునిచ్చారని, దేశాన్ని సమైక్యంగా ఉంచారని ప్రశంసించారు.

ఇలాంటి నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి వెల్లడించాల్సిన అవసరం పారిశ్రామిక రంగానికి ఉందని తెలిపారు. ఆ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తామన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. సంక్లిష్ట సమయంలో దేశాన్ని సురక్షితంగా నడిపించినందుకు ప్రధానికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.
Ratan Tata
Narendra Modi
BJP

More Telugu News