Somu Veerraju: బీజేపీ ద్వారా రాయలసీమ ప్రజలు దమ్ము చూపించాలి: సోము వీర్రాజు

Somu Veerraju comments about Rayalaseema
  • జగన్, చంద్రబాబు సీమ మోసగాళ్లు అంటూ వ్యాఖ్యలు
  • జగన్ రాయలసీమ అభివృద్ధి వ్యతిరేకి అన్న వీర్రాజు 
  • అమరావతిపై ఉద్యమించే హక్కు చంద్రబాబుకు లేదని ఉద్ఘాటన
  • అధికారం ఇస్తే సీమను అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టీకరణ
రాయలసీమ ప్రజలు ద్వితీయ శ్రేణి ప్రజల్లా కనిపిస్తున్నారా? అంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబులపై మండిపడ్డారు. ఆ ఇద్దరూ రాయలసీమ మోసగాళ్లని అభివర్ణించారు. రాయలసీమ పరిస్థితులపై సీఎం జగన్, చంద్రబాబు చర్చకు రావాలని అన్నారు.

అమరావతిని నిర్మించి ఉంటే జగన్ రాజధానిని అక్కడ్నించి తరలించేవారా అని ప్రశ్నించిన సోము వీర్రాజు... అమరావతి కోసం ఉద్యమించే హక్కు చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే రాయలసీమలో అన్నిరకాల అభివృద్ధి చేసిచూపుతామని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ వ్యతిరేకి అని ఆరోపించారు. రాయలసీమ ప్రజల్లో దమ్ములేదని భావించేవాళ్లకు బీజేపీ ద్వారా  దమ్ము చూపించాలని పిలుపునిచ్చారు.

అటు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పందిస్తూ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే రాయలసీమ వాసులు విశాఖ వెళ్లలేరని, సీమలోనే మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానంలో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజేతగా నిలుస్తుందని అన్నారు.
Somu Veerraju
Rayalaseema
Jagan
Chandrababu
BJP
TG Venkatesh

More Telugu News