మమతా బెనర్జీకి షాక్.. 24 గంటల్లో నాలుగు వికెట్లు డౌన్!
- 24 గంటల్లో నలుగురు నేతల రాజీనామా
- పెద్ద సంఖ్యలో రాజీనామా చేస్తున్న దిగువ స్థాయి కేడర్
- అమిత్ షా పర్యటకు ముందు వేగంగా మారుతున్న పరిణామాలు
24 గంటల వ్యవధిలో నలుగురు నాయకులు రాజీనామా చేయడంతో టీఎంసీలో కలకలం రేగుతోంది. మరోవైపు పార్టీకి చెందిన దిగువ స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో టీఎంసీకి రాజీనామా చేస్తుండటం గమనార్హం. వీరంతా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ పర్యటనకు ముందు ఈ రాజీనామాలు చోటుచేసుకుంటుండటం గమనించాల్సిన అంశం.
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో శీలభద్ర దత్తా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో తాను అన్ ఫిట్ అని భావిస్తున్నానని చెప్పారు. తాను టీఎంసీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి చేయలేదని అన్నారు. ప్రజల ఓట్లతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని... అందువల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే... తన ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
మరోవైపు మమతాబెనర్జీని ఉద్దేశించి బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ సెటైర్లు వేశారు. రాజీనామాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఆంటీ (మమత) తన కార్యాలయంలో రాజీనామాల కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.