Narendra Modi: నేటి మధ్యాహ్నం 2 గంటలకు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని!

Narendra Modi Live today at 2 PM
  • రైతు చట్టాలతో ప్రయోజనాలను వివరించనున్న మోదీ
  • మధ్యప్రదేశ్ లో కిసాన్ కల్యాణ్ సమ్మేళన్
  • 25 లక్షల మంది ఖాతాల్లో రూ. 1,660 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం
రైతు చట్టాల గురించి, వాటితో కలిగే ప్రయోజనాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ నేటి మధ్యాహ్నం 2 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కిసాస్ కల్యాణ్ సమ్మేళన్ పేరిట నేడు మధ్యప్రదేశ్ లో ఓ కార్యక్రమం జరగనుండగా, అదే వేదికగా మోదీ రైతులతో మాట్లాడనున్నారు. గడచిన సెప్టెంబర్ లో కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ, గత మూడు వారాలుగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చట్టాలతో రైతులకు కలిగే ప్రయోజనాలను మోదీ వివరించనున్నారని మధ్యప్రదేశ్ ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

"ప్రధాని నరేంద్ర మోదీ, ఈ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడనున్నారు" అని పీటీఐ పేర్కొంది. మోదీ ప్రసంగాన్ని 23 వేల గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో మధ్యప్రదేశ్ లోని 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,660 కోట్లను పంట నష్టం కింద జమ చేయనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం పాల్గొంటారని, ఆ సమయంలో ఆయన రైసిన్ పట్టణంలో ఉంటారని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు జరిగిన నష్టం గురించి మోదీ తెలియజేస్తారని, ఆ సమయంలో రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయిని కూడా నష్ట పరిహారంగా ఇవ్వలేదని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ ఆరోపించారు. తమ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎంతో పటిష్ఠంగా అమలవుతోందని, రైతు సంక్షేమానికి కట్టుబడి వున్నామని అన్నారు.
Narendra Modi
Farmers
Meeting
Kisan Kalyan Sammelan

More Telugu News