Tulasi Reddy: జగన్ వాలకం చూస్తుంటే అమ్మకు అన్నం పెట్టని వ్యక్తి పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుంది: తులసిరెడ్డి

Tulasi Reddy fires on CM Jagan over three capitals issue
  • అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి
  • రాయపూడిలో జనభేరి సభ
  • హాజరైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
  • జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు దిక్కులేదని వ్యాఖ్యలు
  • మూడు రాజధానులు ఎలా కడతారంటూ విమర్శలు
  • ఒక్క రాజధానికే దిక్కులేదని విసుర్లు
అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజధాని ప్రాంతం రాయపూడిలో నిర్వహించిన జనభేరి సభలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో ఒక్క రాజధాని నిర్మించడానికే దిక్కులేదని, అలాంటిది వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెబుతోందని మండిపడ్డారు. సీఎం జగన్ వాలకం చూస్తుంటే అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుంది అని విమర్శించారు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు దిక్కులేదని, పెన్షన్లు ఇచ్చేందుకు దిక్కులేదని, రిజర్వ్ బ్యాంకు వద్దకు చిప్ప పట్టుకుని వెళ్లి దేహీ అనే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. "అలాంటి ఈయన మూడు రాజధానులు నిర్మిస్తాడట. తప్పు చేయడం మానవ సహజం. తప్పు సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి... మీరు ఏ దుర్ముహుర్తానో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. విజ్ఞతతో వ్యవహరించి మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. ఎవరు కావాలంటున్నారు మూడు రాజధానులు? మాకు దూరం అని రాయలసీమ వాసులు వద్దంటున్నారు. ఉన్న రాజధాని పోతోందని దక్షిణ కోస్తా ప్రజలంటున్నారు. ఇది వచ్చినా ఉండదు, మళ్లీ అక్కడికే పోతుందని ఉత్తరాంధ్ర వాళ్లంటున్నారు.

ఎవరి కోసం ఇదంతా? కనీసం మీ పులివెందుల నియోజకవర్గంలో ఒక్కరైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరిస్తారేమో కనుక్కో. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే నువ్వు ప్రతిరోజు మాట తప్పుతుంటావు. 2014 సెప్టెంబరు 4న పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో నువ్వేం మాట్లాడావు? కనీసం ఆ మాటమీదైనా నిలబడు" అంటూ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు.
Tulasi Reddy
Jagan
Three Capitals
Amaravati
Andhra Pradesh

More Telugu News