apsrtc: సంక్రాంతి స్పెషల్ గా 1,500 బస్సులు!

1500 Special Buses as Sankranthi Special
  • ఉభయ గోదావరి జిల్లాల బస్సులు ఇప్పటికే ఫుల్
  • ఆపై విశాఖ, తిరుపతి, కర్నూలు రూట్లకు డిమాండ్
  • కరోనా కారణంగా తగ్గిన ప్రత్యేక బస్సులు
ఈ సంక్రాంతి సీజన్ లో వివిధ నగరాల నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారి కోసం మొత్తం 1,500 ప్రత్యేక సర్వీసులను నడిపించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత సంవత్సరం దాదాపు 2,200 బస్సులు తిప్పిన అధికారులు, ఈ సంవత్సరం కరోనా కారణంగా అంతగా డిమాండ్ ఉండదన్న భావనలో సర్వీసుల సంఖ్యను తగ్గించారు. నిన్న అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎండీ కృష్ణబాబు, అత్యధిక సర్వీసులను హైదరాబాద్ కు నడిపించేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సీజన్ కు సంబంధించి హైదరాబాదు నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే సర్వీసుల రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఆ తరువాత విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు రూట్లలో డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. ఎంజీబీఎస్ లో బస్సుల రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులను కదిలించేలా షెడ్యూల్ కూడా తయారైంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, మాచర్ల, ఒంగోలు, తిరుపతి బస్సులు గౌలిగూడ సిటీ బస్ టర్మినల్ నుంచి బయలుదేరుతాయి.

ఇక విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం అన్ని స్పెషల్ బస్సులు, బయలుదేరిన ప్రాంతం నుంచే నేరుగా (ఎంజీబీఎస్ లోకి రాకుండా) వెళ్లిపోతాయి. విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకూ ప్రత్యేక సర్వీసులను నడిపించాలని అధికారులు నిర్ణయించారు.
apsrtc
Sankranthi
Special Buses

More Telugu News