Chandrababu: అందుకే ప్రజా రాజధానిని నిర్మించేందుకు సంకల్పించాం: చంద్రబాబు

chandra babu slams ycp
  • ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది
  • యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నాం
  • రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారు
  • అమరావతిని ఈరోజు శిథిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది
అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ ఏపీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. రాజధానిగానే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి, యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నాం’ అని చెప్పారు.

‘ఆ కారణంగానే ఐదు కోట్ల ఆంధ్రులూ గర్వంగా చెప్పుకునేలా ప్రజారాజధాని అమరావతిని నిర్మించేందుకు ఆనాడు సంకల్పించాం. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారు’ అని చంద్రబాబు అన్నారు.

‘ఆనాడు అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి పవిత్రస్థలాల మట్టిని, నీటిని పంపించి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను, ఆమోదాన్ని తెలియజేశారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగరాన్ని ఈరోజు శిథిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది’ అని అన్నారు.

‘రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుతోన్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు మనమే బాధ్యులం అవుతాం. అందుకే రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి. ఆంధ్రులందరిదీ ఒకే మాట, ఒకే రాజధాని అని చాటాలి’ అని చంద్రబాబు నాయుడు కోరారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News