Balka Suman: కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు: బాల్కసుమన్

TRS MLA Balka Suman warns Telangana BJP Chief Bandi Sanjay
  • సంజయ్ అర్థరహితంగా మాట్లాడుతున్నాడని విమర్శలు
  • అనేక పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్ అని వెల్లడి
  • కేసీఆర్ గురించి ఆచితూచి మాట్లాడాలని హితవు
  • కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది ఓ సీఎంగానే అని స్పష్టీకరణ
  • ప్రజలే బుద్ధి చెబుతారంటూ సంజయ్ కి వార్నింగ్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపైనా, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు అవగాహన పెంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. స్థాయి లేనివాళ్లు కూడా కేసీఆర్ గురించి మాట్లాడేవాళ్లేనంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన గురించి ఆచితూచి మాట్లాడడం అలవర్చుకోవాలని స్పష్టం చేశారు.

అర్థరహితంగా మాట్లాడుతున్న బండి సంజయ్ ముందు రాజ్యాంగ వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య అనేక సంబంధాలు ఉంటాయని, వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని బాల్క సుమన్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏంచేశారని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ కి ఢిల్లీలో ఏంజరిగిందో తెలియదా? అంటూ అసహనం ప్రదర్శించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా, లేక అవగాహన లేదా? అని ప్రశ్నించారు.

ప్రధానమంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం సాధారణమైన విషయం అని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించేందుకే ప్రధానిని సీఎం కేసీఆర్ కలిశారని వివరణ ఇచ్చారు. తాను ఇప్పుడు స్పందిస్తుంది బండి సంజయ్ అడిగాడని కాదని, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాం అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Balka Suman
Bandi Sanjay
KCR
New Delhi

More Telugu News